టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ మేరకు జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు జూన్ నెల వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. 2011లో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని దాదాపు 29 రోజుల పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటి వరకు 7 డీఏలను మంజూరు చేసింది. మిగిలిన ఒక డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనార్ చెప్పారు.