పసిడితో పోటీ పడుతున్న పచ్చ బంగారం..ధర ఎంతంటే..?
X
పసుపు పంట రైతులకు సిరులు కురిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో అంతంత మాత్రంగా ఉన్న పసుపు ధరలు అమాంతం పెరగడంతో రైతుల పంట పండుతోంది. మునుపెన్నడూ లేని విధంగా పసుపు ధరలు మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పసుపు సాగులో రైతులు అనేక నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించినా పెద్దగా లాభాలు లేకపోవడంతో ఇప్పటికే కొంత మంది రైతులు పసుపు సాగును వీడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. మిగతా వారు మాత్రం పసుపు పంటనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ధరలు పెరగడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆసియాలో అతి పెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో క్వింటా పసుపు ధర రూ.12వేలకు పైబడి పలుకుతోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో పసుపుకు ఏర్పడిన డిమాండ్ , దిగుబడి తగ్గడం వల్లనే ధరలు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ధరలు అమాంతం పెరగడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్ పసుపు పంటతో కళకళలాడుతోంది. కేసముద్రం మార్కెట్ యార్డ్ లో గత నాలుగు రోజులుగా పసుపు ధర రూ.12 వేలకు పైగానే పలుకుతోంది. అయితే ఇప్పటికే చాలా మంది రైతులు పంటను వ్యాపారులకు విక్రయించారు. దీంతో పెరిగిన ధరల వల్ల వ్యాపారులకే ఎక్కువ లాభం ఉంటుందని రైతులు వాపోతున్నారు. కాస్మోటిక్, ఫార్మ సంస్థ కంపెనీలు ఇక్కడి పసుపు కోసం క్యూలు కడుతున్నారు. అందుకే ధరలు ఇంతలా పెరుగుతున్నాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.