గోషామహల్లో రాజాసింగ్ నామినేషన్.. గెలుపు పక్కా అంటూ..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గోషామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. తొలుత దూల్‌పేట ఆకాశ్‌పురి హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
గోషామహల్‌లో తన గెలుపు ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదని.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఇంకా నిర్ణయించలేదని ఎద్దేవా చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని ప్రతిపక్షాలు చూసినప్పటికీ.. ప్రజలు తనకు అండగా నిలిచారని చెప్పారు. హ్యాట్రిక్ విక్టరీ కొట్టి.. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీకి తన సత్తా చూపిస్తామన్నారు.