వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన
X
తెలంగాణను ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటించారు. తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరద ప్రభావిత కాలనీల్లో పర్యటించి.. ప్రజల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్, నిత్యావసరాలను బాధితులకు ఆమె పంపిణీ చేశారు.
ఇటీవల గండి పడిన భద్రకాళి చెరువును పరిశీలించారు. వర్షాన్ని, వరదలను నియంత్రించలేము కానీ.. ముంపును ముందుగానే పసిగట్టి తగిన చర్యలు తీసుకోవచ్చన్నారు. వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైందని.. ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సి ఉందన్న ఆమె.. సమస్యల శాశ్వత పరిష్కారానికి తగని చర్యలు తీసుకోవాలన్నారు.