మల్కాజ్‌గిరిలో పోటీపై శంభీపూర్ రాజు క్లారిటీ
X
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అసంతృప్తులు, ముఖ్య నాయకులను, కార్యకర్తలను అందరితో కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే ఇంతలోనే తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే.. తానేంటో చూపిస్తానంటూ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు కూడా.
బీఆర్ఎస్ అధిష్టానం సైతం మల్కాజ్‌గిరి అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అతని స్థానంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మల్కాజ్‌గిరి అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ప్రచారాలకు బలం చేకూరుస్తూ... తాజాగా మంత్రి హరీశ్ రావు తో శంభీపూర్ రాజు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మల్కాజిగిరి అభ్యర్థిగా శంభీపూర్ రాజు ఫిక్స్ అయినట్లే అని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. మంత్రి హరీష్ రావు గారిని ఈ ఉదయం కలిసిన మాట వాస్తవమే కానీ.. పలు మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు మాత్రం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. నియోజవర్గానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే మంత్రి గారిని కలవడం జరిగిందన్నారు. పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా గౌరవ సీఎం కేసీఆర్ గారి సైనికుడిగా ఎల్లప్పుడు ఉంటానని, పార్టీ ఆదేశాల మేరకు మాత్రమే నడుచుకుంటానని చెప్పారు.