రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదు.. రాజ్‌భవన్ వర్గాలు
X
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం అవతరించి పదవ ఏట అడుగిడిన సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గోల్కొండలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. మరికాసేపట్లో నూతన సచివాలయంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా జెండా ఆవిష్కరించి దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.
ఆవిర్భావ దినోత్సవ వేళ.. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది యువత చేసిన త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్స్, వ్యవసాయ రంగాల్లో అగ్రగామిగా ప్రసిద్ది చెందిన తెలంగాణ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి మార్గంలో పురోగమిస్తుందని చెప్పారు. తెలంగాణ అలుపెరగని చైతన్యం రోజురోజుకు మరింత బలపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నట్లు రాజ్‌భవన్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
ఇదిలా ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. రాజ్ భవన్‌లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రాజ్‌భవన్‌లోని దర్బారు హాల్‌లో గవర్నర్ తమిళిసై సామాన్య ప్రజలు, ప్రముఖులతో కలిసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పంచుకుంటారు. రాజ్‌భవన్‌లో జరిగే వేడుకలకు సామాన్య ప్రజలకు ఆహ్వానం ఉందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.