Governor Tamilisai: రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందింది.. గవర్నర్ తమిళిసై
X
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ‘‘తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం. మా పాలన దేశానికి ఆదర్శం కాబోతోంది’’ అని చెప్పారు.
కాళొజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై.. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని చెప్పారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్న గవర్నర్... పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని, అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలయ్యాయన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యితనిస్తుందని చెప్పారు.
ప్రజా సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించామన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సీఎం తొలి సంతకం చేశారన్నారు. తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికిందని, బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు. ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే మా ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. వచ్చే 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.