TSPSC : మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. కొత్త టీం ఇదే..
X
టీఎస్పీఎస్పీ ఛైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఆయన నియామకానికి సంబంధించి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓకే చెప్పారు. దీంతో త్వరలోనే ఆయన టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలోనే మిగతా సభ్యుల భర్తీ జరగనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్తో భేటీ చర్చించారు. వాస్తవానికి స్క్రీనింగ్ కమిటీ మరో ఇద్దరి పేర్లను పరిశీలించినా చివరకు మహేందర్ రెడ్డి పేరు ఖరారుచేశారు. టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, యాదయ్య, ఉమర్ ఉల్లా ఖాన్, రామ్మోహనరావులను నియామకానికి కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఛైర్మన్ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. ఈ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది.
ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో పుట్టారు. ఆయన 1968 బ్యాచ్ పోలీస్ సర్వీస్ అధికారి. ఏఎస్పీగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన డీజీపీగా పదవీ విరమణ చేశారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితులయ్యారు. 2018 ఏప్రిల్10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్‌లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే ఛాన్సుంది. కమిషన్ నిబంధనల మేరకు 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.