ఆర్టీసీ బిల్లు మళ్లీ వెనక్కి పంపిన గవర్నర్.. ఎందుకంటే..?
X
ఆర్టీసీ బిల్లు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. కేసీఆర్ సర్కారు పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరిన్ని వివరణలు కోరారు. ఐదు అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉదయం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్ బిల్లుపై మరిన్ని సందేహాలు వ్యక్తంచేశారు. మరో ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం ఇప్పటి వరకు సభలో ఆర్టీసీ బిల్లు పెట్టలేకపోయింది.
అంతకుముందు గవర్నర్ లేవనెత్తిన ఐదు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని చెప్పింది. అన్ని అంశాలపై వివరణ ఇచ్చినందున అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని గవర్నర్.. ఆర్టీసీ బిల్లుపై మరిన్ని సందేహాలు లేవనెత్తారు. దీంతో ఆదివారంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ సెషన్‌లో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం లభిస్తుందో లేదోనని ఆందోళన ఆర్టీసీ కార్మికుల్లో మొదలైంది.
ఇదిలా ఉంటే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ ఉదయం ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్ ముట్టడించారు. ర్యాలీగా తరలివచ్చిన వేలాది మంది కార్మికులు రాజ్‌భవన్ ముందు బైఠాయించారు. గవర్నర్ బిల్లుపై సంతకం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆందోళన చేశారు. దీంతో కొంత మంది కార్మిక సంఘాల నేతలతో దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడిన గవర్నర్.. తాను ఎందుకు బిల్లుకు ఆమోదం తెలపలేదో వివరించారు.
telangana,assembly,monsoon session,governor tamilisai,tsrtc bill,corporation,kcr government,rtc employees,bifurcation law,finance bill