Khairatabad Ganesh: మహాగణపతికి తొలిపూజ.. హాజరైన గవర్నర్ తమిళిసై
X
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ నిర్వహించారు. గణేశుడు ఈసారి ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. విఘ్న నాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక అంతకుముందు మహా వినాయకుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు. మొదటగా శ్రీదశమహా విద్యాగణపతికి పద్మశాలి సంగం తరపున పట్టు వస్త్రాలు, గరికపూస, వెండి జంజాన్ని నిర్వాహకులు సమర్పించారు. నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఖైరతాబాద్, శాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ ల దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు.