'బోనాలకు ఆహ్వానం పంపలేదు.. అయినా హ్యాపీ మూడ్‌లోనే ఉన్నా'
X
రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సహా అంతకుముందు జరిగిన ప్రధాన కార్యక్రమాలకు.. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఆహ్వానం పంపలేదన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా మరోసారి కేసీఆర్ సర్కార్ పై ఆరోపణలు చేశారు. తనకు బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని చెబుతూనే.. అయినా సంతోషంగానే ఉన్నానని చెప్పారు. రాష్ట్ర పండుగ అయిన బోనాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పాతబస్తీలోని లాల్‌దర్వాజా బోనాలకు సైతం తనకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్. దాంతో రాజ్‌భవన్‌లో నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. నల్లపోచమ్మ అమ్మవారికి తమిళిసై బోనం సమర్పించి వడి బియ్యం పోశారు. బోనం సమర్పించడంలో మహిళా సిబ్బంది ఆమెకు సహకరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ప్రజలు వేడుక జరుపుకుటున్నారని అన్నారు. అమ్మవారు రాష్ట్ర ప్రజలని చల్లగా చూడాలని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనను బోనాలకు ఆహ్వానించకున్నా ఏ సమస్య లేదని, రాజ్ భవన్ కుటుంబసభ్యులతో వేడుక జరుపుకున్నానని చెప్పారు. సాధారణంగా కేసీఆర్ ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా.. తనకు ఆహ్వానం అందదని, ఇది కూడా అలాంటిదేనన్నారు. తనకు ఇదేమీ కొత్త కాదని అన్నారు. ఇక భారతదేశ ప్రతిష్ట అయిన చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు ఆమె అభినందనలు తెలిపారు.