గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై తమిళిసై సంచలన నిర్ణయం
X
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వ ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు పంపే ప్రతిపాదనలకు సంబంధించి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారు. రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చిన తర్వాతే కొత్త ప్రతిపాదనలు స్వీకరించాలని డిసైడయ్యారు.
గతేడాది సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసైకు పంపారు. అయితే గవర్నర్ వారి పేర్లను తిరస్కరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టునుఆశ్రయించారు. ఆర్టికల్ 171 ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని పిటిషన్ దాఖలు చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేరని శ్రవణ్, సత్యనారాయణ కోర్టుకు విన్నవించారు.
ఇదిలా ఉంటే ఆర్టికల్ 361 ప్రకారం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ అర్హత లేదని గవర్నర్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటీషన్ మెయింటేనబులిటీపై జనవరి 24న నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై నామినేటెడ్ కోటా ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించారు.