Home > తెలంగాణ > ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.. పునర్నిర్మించే ప్రయత్నంలో ఉన్నాం - Governor Tamilisai

ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.. పునర్నిర్మించే ప్రయత్నంలో ఉన్నాం - Governor Tamilisai

ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.. పునర్నిర్మించే ప్రయత్నంలో ఉన్నాం -  Governor Tamilisai
X

ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆర్థికవ్యవస్థను గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి అప్పగించారని దాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని అన్నారు. ప్రస్తుతం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడిందని గవర్నర్ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెలన్నీ తొలగించామని, ప్రగతిభవన్‌ ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటామని గవర్నర్ తమిళిసై అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేస్తున్నామని త్వరలోనే మరో రెండు అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, త్వరలోనే అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. త్వరలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాపాలనలో 1.8కోట్ల దరఖాస్తులు వచ్చాయని, ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తామని చెప్పారు.

ప్రజలపై భారం వేయకుండా సంస్కరణలు అమలు చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. రూ. 2వేల కోట్లతో ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నామని, త్వరలో ఇంటింటికీ ఇంటర్నెట్ అదిస్తామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ విధానం తీసుకురావడంతో పాటు మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టంచేశారు. ఎకో టూరిజం హబ్ లుగా హుసేన్ సాగర్, లక్నవరంను తీర్చిదిద్దడంతో పాటు క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాలకు ప్రత్యేక ప్రణాళిక అమలుచేస్తామని స్పష్టం చేశారు.

Updated : 8 Feb 2024 7:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top