Home > తెలంగాణ > ఆర్టీసీ బిల్లుపై చర్చ.. అధికారులకు టైమిచ్చిన గవర్నర్‌

ఆర్టీసీ బిల్లుపై చర్చ.. అధికారులకు టైమిచ్చిన గవర్నర్‌

ఆర్టీసీ బిల్లుపై చర్చ.. అధికారులకు టైమిచ్చిన గవర్నర్‌
X

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లుపై చర్చించేందురు గవర్నర్‌ తమిళిసై అధికారులకు సమయం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి, అధికారులతో గవర్నర్‌ సమావేశం కానున్నారు. మరోవైపు స్పీకర్ పోచారంతో సమావేశమైన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌.. ఈ బిల్లు విషయమై చర్చించారు. గవర్నర్‌ అనుమతిస్తే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

బిల్లుపై రాజ్‌భవన్‌ వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం.. మళ్లీ రాజ్‌భవన్‌ శనివారం మధ్యాహ్నం కొత్త సందేహాలు వ్యక్తంచేయడం, ప్రభుత్వమూ సాయంత్రమే వాటికి సమాధానాలు పంపడంతో అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశానికి నోచుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.ఆర్టీసీ విభజన, కార్మికుల జీతభత్యాలు, పింఛన్లు, ఉద్యోగ భద్రత వంటి 5 ప్రధాన అంశాలపై రాజ్​భవన్​ సందేహాలు లేవనెత్తగా.. సీఎస్​ శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి చెందని గవర్నర్​.. మరో 6 అంశాలపై అదనపు సమాచారం కోరారు. వాటి వివరాలతో కూడిన లేఖను విడుదల చేసిన రాజ్​భవన్.. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాలవాంఛను రాజ్​భవన్ అడ్డుకోవడం లేదని, వారికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రక్రియను పూర్తి చేయడానికే గవర్నర్​ తదుపరి వివరణను కోరారని పేర్కొంది. ఆ లెటర్‌కు కూడా శనివారం సాయంత్రమే సీఎస్​ సమాధానమిచ్చారు.

బిల్లు లక్ష్యాల్లో పేర్కొన్నట్లు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్ అని.. దీని కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనమవుతారని.. ఆస్తులు, అప్పులు అన్నీ కార్పొరేషన్​కే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతిపాదిత బిల్లులో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకోవడం లేదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీఎస్​ఆర్టీసీ విభజన ఇంకా కేంద్రం వద్ద ఉన్నందున.. కార్పొరేషన్ స్థిర, చరాస్థులు టీఎస్​ఆర్టీసీకే ఉంటాయని స్పష్టత ఇచ్చింది.

Updated : 6 Aug 2023 10:53 AM IST
Tags:    
Next Story
Share it
Top