Khammam : ఖమ్మంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్లకు అంతరాయం
X
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వెళ్లు మార్గంలో ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో పైలట్ రైలును నిలిపేశారు. రెండు బోగీలు ట్రాక్ నుంచి పక్కకు ఒరిగిపోయాయి. సాంకేతిక లోపం కారణంగానే ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ సంఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ- ఖమ్మం మార్గంలో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. మధిర, బోనకల్లు,డోర్నకల్ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రైళ్లను రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.