వినాయక మండపాలవద్ద ఇది తప్పనిసరి.. లేదంటే!
X
దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగే గణేష్ ఉత్సవాల్లో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గల్లీలన్నీ ఒక్కటై అట్టహాసంగా ఈ వేడుకను జరుపుకుంటాయి. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కాబోయే గణేష్ ఉత్తవాల కోసం భాగ్యనగర్ ఉత్సవ సమితి ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా తాజాగా రాచకొండ పోలీస్ కమీషనర్ డీఎస్ చౌహాన్ నగర వాసులకు కొన్ని సూచనలు చేశారు. నేరేడ్మెట్ లోని సీపీ కార్యాలయంలో భాగ్యనగర్ ఉత్సవ సమితితో సమన్వయ, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పోలీసుల తరఫున ప్రటిష్టమైన భద్రత, బందోబస్తును అందిస్తామన్నారు. మండపాల గురించి ముందే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రతి మండపం దగ్గర నిర్వాహకుల వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద 24 గంటలు వలంటీర్లు ఉండాలని, భక్తుల సందర్శనార్థం క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. డీజేలకు అనుమతి లేని కారణంగా ఊరేగింపును ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.