పార్టీ మార్పు వార్తలపై స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
X
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం ఖండించారు. తాను రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానని, తనకు ఏ పార్టీతో సంబంధంలేదని స్పష్టం చేశారు. తాను చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తానని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ప్రజలకు ప్రేమ, నమ్మకం తప్ప వ్యతిరేకత లేదని గుత్తా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ రావాలి - మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయన్న గుత్తా.. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం పథకాల అమలు సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవాలని సూచించారు. అవసరమైతే సర్కారుకు అవసరమైన సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.