రాహుల్ను కలిసిన హనుమాండ్ల ఝాన్సీ.. పాలకుర్తిలో ఎర్రబెల్లితో ఢీ..?
X
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్నారై దంపతులు హనుమాండ్ల ఝాన్సీ, రాజేందర్ కలిశారు. ఆయనతో కాసేపు ముచ్చటించారు. రాజేందర్ రెడ్డి అమెరికాలో కార్డియాలజిస్టుగా పనిచేస్తుండగా.. ఝాన్సీ రెడ్డి ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వారిరువురూ వచ్చే నెలలో తొర్రూరులో జరిగే భారీ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
నెలాఖరులో స్వస్థలానికి
ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఝాన్సీ, రాజేందర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. పర్యటన సమయంలో వారి ఇంట్లోనే బస చేసిన రేవంత్ పార్టీలోకి అహ్వానించగా వారు అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఇండియాకు రానున్న ఝాన్సీరాజేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతారని సమాచారం.
ఎర్రబెల్లితో ఢీ
రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పేరుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా విజయం సాధిస్తారన్న నమ్మకం ఉంది. మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అమెరికాలో స్థిరపడ్డ పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులను బరిలో నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులకు స్థానికత, సేవా కార్యక్రమాలు ప్లస్ అవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. నిజానికి ఎర్రబెల్లి సైతం సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవుతున్నా ఆయన స్వగ్రామం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. దీంతో పాలకుర్తికి స్థానికేతరుడనే భావన నెలకొంది. ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎర్రబెల్లికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సొంతూరి కోసం
పుట్టిన గడ్డ మీద మమకారంతో ఝాన్సీ, రాజేందర్ దంపతులు 25ఏండ్ల క్రితమే చర్లపాలెంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. గ్రామంలో సొంత నిధులతో పాఠశాల ఏర్పాటు చేశారు. అందులో 15 ఏండ్లుగా ఇంగ్లీషు మీడియంలో బోధనను అందిస్తున్నారు. పాఠశాలకు సంబంధించిన ప్రతి అభివృద్ధి పనిలో వారు భాగస్వాములవుతున్నారు. అక్కడ విద్యార్థులకు ఏటా స్కాలర్ షిప్పులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతో పాటు ఎకరం సొంత భూమిని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చారు. తొర్రూరు మండలంలో అతి త్వరలో 80ఎకరాల స్థలంలో అనాథాశ్రమమం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అమెరికాలో సేవా కార్యక్రమాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ రాజేందర్ రెడ్డి 1985లో అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడి నెంబర్ వన్ కార్డియాలజిస్టుగా పేరు సంపాదించుకున్నారు. రాజేందర్, ఝాన్సీ దంపతులు అమెరికాలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో పాటు సొంతూరి కోసం గత 30ఏండ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. 1995లో తొర్రూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారి సొంత నిధులతో నిర్మించారు. 1995లోనే చంద్రబాబు నాయుడు హయాంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు.