ప్రజాపాలన అంటే ఇదేనా?: మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు
X
కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని ఓ అధికారిక కార్యక్రమం నుంచి బలవంతంగా పంపించడంపై హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని సెటైర్లు వేశారు. కాగా ఈ రోజు భువనగిరిలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కు చెందిన జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ఘటనపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 'ప్రజాపాలన'లో విపక్ష ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మంత్రుల వైఖరి గర్హనీయమన్నారు.
మొన్న రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. నేడు యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై దుర్భాషలాడారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడకు నిదర్శమని అన్నారు. ఆయనను తిట్టడం చాలదన్నట్లు మంత్రి పోలీసులకు హుకుం జారీ చేసి సందీప్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపారని అన్నారు. దీనిని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వాదులంతా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరును తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డిని హరీశ్ రావు డిమాండ్ చేశారు.