Harish Rao : 'నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చూపిస్తా'.. హరీష్ రావు వ్యాఖ్యలు దేనికి సంకేతం..?
X
ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ జరుగుతున్న సంగతి తెలిసిందే. పాలక పక్షం, విపక్షాలు సైతం ఇదే అంశంపై అటు అసెంబ్లీలోనూ, ఇటు మీడియా సమావేశాల్లోనూ అదే పనిగా చర్చిస్తున్నారు. బుధవారం కూడా అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి సవాల్ విసిరారు. 'సీఎంగా నువ్వు అవ్. కాళేశ్వరంలో ఎట్ల నీళ్లు పారించు' అని మాట్లాడారు. ఈ సవాల్‌ను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించారు. 'నీకు చెయ్య చాతగాకపోతే. నాకు చాతకాదు అని ఒప్పుకొని తప్పుకో. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తా. అనంతరం కాళేశ్వరం నీళ్లు ఎలా పారిస్తానో చూడు' అని సవాల్ విసిరారు. కాళేశ్వరంలో మేడిగడ్డ బేరాజ్‌లో పిల్లర్లు కుంగిపోయినా నీళ్లు పారించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారని, కానీ రేవంత్ రెడ్డికి తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియా పాయింట్‌లో మాట్లాడనివ్వకపోవడంతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో దయనీయ పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో హరీశ్ రావు .. 'తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. వాళ్లకు చేతకాకపోతే రేవంత్ రాజీనామా చేయాలి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తా' అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో పలు ఆసక్తికర చర్చలకు దారి తీస్తున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు హరీష్ రావు హస్తం గూటికి చేరుతారా? అని సందేహాలు సామాన్య జనాల్లో మొదలయ్యాయి. ఇటీవలే కాంగ్రెస్ నాయకులు పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే హరీష్ రావు వంటి అగ్రనేత.. బీఆర్ఎస్ ని అంత ఈజీగా వీడుతారా? అని కొందరు అంటున్నారు.