Harish Rao : ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు ఇవ్వాలి : హరీష్ రావు
X
కాంగ్రెస్ సర్కార్ ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వరంలో నిర్వహిస్తోన్న ఆటల పొటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మట్లాడిన హరీష్ రావు.. సిద్ధిపేటకు ఆటో డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడారు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవ మర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారన్ని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని.. రాష్ట్రంలోని 6లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేల జీవన భృతి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆటో డ్రైవర్ల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.