మొత్తం కాళేశ్వరమే నాశనమైనట్లు ప్రచారం చేస్తున్నరు: హరీశ్ రావు
X
కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ప్రతిపక్షాలన్నీ దుష్పచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఒక బ్యారేజీలో ఓ పిల్లర్ కుంగితే దాన్నిపట్టుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే నాశనం అయింది అనడం తప్పని ధ్వజమెత్తారు. అవగాహన లేక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై బురద జల్లుతుందని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అంటే.. మొత్తం 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 1500 కిలోమీటర్ల కాలువలు. ఇంతపెద్ద ప్రాజెక్టులో ఒక బ్యారేజీ పిల్లర్ కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే నాశనమైనట్లు ప్రచారం చేస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి అయిన ఖర్చు రూ.80 వేల కోట్లైతే.. దాన్ని రూ. లక్ష కోట్లని ప్రచారం చేయడం అవమానకరం అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా తమ పార్టీలో ఎవరూ పదవుల కోసం కొట్లాడుకోరని హరీశ్ స్పష్టం చేశారు. సీఎం కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని చెప్పుకొచ్చారు. తన దృష్టిలో పదవులకంటే వ్యక్తిత్వమే గొప్పదని అన్నారు. కేటీఆర్ కు తనకు.. బంధుత్వంకన్నా, స్నేహానుబంధమే ఎక్కువుందని చెప్పారు. కేటీఆర్ ను సీఎం చేసినా తనకు ఏ అభ్యంతరం లేదని అన్నారు. తను బీఆర్ఎస్ పార్టీకి ఓ కార్యకర్తనని, ప్రజా సేవకుడిని అని స్పష్టం చేశారు. ఎప్పుడూ కేసీఆర్ కు అండగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు.