Home > తెలంగాణ > కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మినట్లే.. హరీశ్..

కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మినట్లే.. హరీశ్..

కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మినట్లే.. హరీశ్..
X

‘‘మూడు గంటల కరెంటు కావాలో, మూడు పంటల కరెంటు కావాలో ప్రజలే తేల్చుకుంటారు. తెలంగాణను చీకట్లో నింపిన కాంగ్రెస్ నేతలు దురుద్దేశంతోనే కరెంటుపై గొడవ చేస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టడానికి కారణమే కరెంటు’’ అని అన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ రైతులకు 24 గంటల విద్యుత్ అక్కర్లేదని, విద్యుత్ కంపెనీల నుంచి కమీషన్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఈ అంశంపై ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్య రాజాసింగ్ తనను ఎందుకు కలిశారో కూడా హరీశ్ చెప్పారు. గోషా మహల్ నియోజవర్గంలోన ఆస్పత్రుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారన్నారు.

బండారం బయటపడింది...

కాంగ్రెస్ పార్టీకి రైతులపై పట్ల ఉండే వ్యతిరేకత రేవంత్ వ్యాఖ్యలతో బయటపడిందని హరీశ్ అన్నారు. ‘‘ రేవంత్ రెడ్డి మూడు గంట‌ల క‌రెంట్ చాలు అంటారు. ఉచిత కరెంట్‌కు సోనియా గాంధీ వ్య‌తిరేక‌మ‌ని ఆ పార్టీ నేత కల్వ సుజాత అంటారు. బోరుబావుల వ‌ద్ద మీట‌ర్లు పెడుతామ‌ని మరో నేత అద్దంకి ద‌యాక‌ర్ బెదిరిస్తారు. కరెంట్ ఇవ్వలేక క్రాప్ హాలిడే ప్రకటించిది మీరే కదా. ఇందుకే జనం మీపై తిరగబడుతున్నారు. కుడితిలోపడ్డ ఎలకల్లాగా కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీ తిడుతున్నారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను విమ‌ర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మినట్లే’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రైతులకు ఏడు గంటల కరెంటు ఇవ్వలేమి ఆనాటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రే చెప్పాడని, మళ్లీ అలాంటి పరిస్థితి తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో రైతులకు నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని హరీశ్ చెప్పారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్ విమర్శ పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో కరెంటు చార్జీలు తగ్గించాలని కేసీఆర్ చంద్రబాబు నాయుడికి లేఖ రాశారని, రైతుల కోసం పదవులను గడ్డపోచల్లా వదులుకున్నారని తెలిపారు. ఎవరు మంచి కరెంట్ ఇచ్చారో రెఫరెండానికి కాంగ్రెస్ సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ‘‘విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేసీఆర్ 37 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బావుల దగ్గర మీటర్లు పెట్టకపోవడం వల్ల తెలంగాణ కేంద్రం నుంచి రావాల్సిన 35 వేల కోట్లు నష్టపోయింది. 35 వేల కోట్లు కాదు 65 లక్షల మంది రైతుల భవిష్యత్ ముఖ్యం అని కేసీఆర్ భావిస్తున్నారు’’ అని చెప్పారు.

Updated : 14 July 2023 7:41 PM IST
Tags:    
Next Story
Share it
Top