మెదక్లో గుండె పగిలే విషాదం..పిల్లాడిని కాపాడబోయి ఆ ముగ్గురు..
X
మెదక్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా జరిగిన ఓ ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. చెరువులో పడిపోయిన ఓ బాలుడిని కాపాడబోయిన ముగ్గురు మహిళలతో పాటు ఆ బాలుడిని చెరువు మింగేసింది. దీంతో ఆ నాలుగు కుటుంబాల్లోని సభ్యులు తమ ఆప్తులను పోగొట్టుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు.
మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది. స్నానానికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. బాలుడు చెరువులో మునిగిపోవడం చూసిన ఓ మహిళ బాలుడిని రక్షించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ మహిళ కూడా చెరువులో పడి మునిగిపోయింది. వీరిద్దరినీ గమనించిన మరో ఇద్దరు మహిళలు వెంటనే చెరువు దగ్గరికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వీరు కూడా చెరువులో పడిపోవడంతో బయటికి రాలేక చనిపోయారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో హుటాహుటిన చెరువు దగ్గరకు చేరుకున్నారు. అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది. చెరువు ఆ నలుగురిని మింగేసింది. ఈ ప్రమాదం గురించి గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మహిళల మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఇంకా బాలుడి మృతదేహం లభించలేదు. బాలుడి డెడ్ బాడీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ మహిళల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తమవారు విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.