హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం..
X
హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్ లో వర్షం దంచికొడుతోంది. కూకట్ పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. అమీర్‌పేట, మైత్రీవనంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ముసురు పట్టింది. సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, దుండిగల్, గండి మైసమ్మ, బాహదూర్ పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజులరామారం ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.