తెలంగాణలో భారీ వర్షాలు.. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
X
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా నిన్నటి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో వాన దంచికొట్టింది.
శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో అత్యధికంగా 141.3 మి.మీ, హన్మకొండ జిల్లా పర్కల్‌లో 126.3 మి.మీ, వరంగల్‌లోని నెక్కొండలో 121.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు హనుమకొండ జిల్లా శాయంపేటలో గోడకూలి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.