ఆరెంజ్ అలర్ట్.. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
X
తెలంగాణను వర్షాలు వీడడం లేదు. గత వారం రోజుల వానలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిన్నటి నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చిన వాన.. మళ్లీ దంచికొట్టేందుకు సిద్ధమైంది. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఇక ఈ నెల 25న ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, 26న సిరిసిల్ల, పెద్దపెల్లి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మంగళవారం, బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక అదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా ఉధృతి కొనసాగుతోంది. జైనాథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో బ్రిడ్జిపై నుంచి తెలంగాణ - మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలను చాలాసేపు నిలిపేశారు. ఆ తర్వాత ప్రవాహం కొద్దిగా తగ్గడంతో.. ఉన్నతాధికారులు బ్రిడ్జిని పరిశీలించి ఒక్కో వాహనాన్ని అనుమతిస్తున్నారు.