అష్టజల దిగ్బందంలో మొరంచపల్లి
అష్టజల దిగ్బంధంతో మొరంచపల్లి మాయం
X
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మొరంచ వాగు ఉగ్ర రూపానికి మొరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై మొరంచపల్లి వద్ద సుమారు 15 ఫీట్స్ ఎత్తులో మొరంచ వుప్పొంగి ప్రవహిస్తోంది. దీనితో 353సీ జాతీయ రహదారి పై రవాణా పూర్తిగా నిలిచి పోయింది. ఎగువన గణప సముద్రం 3 ఫీట్లు మేర మత్తడి పడుతుండం, ఆ నీరు మొరంచలో చేరటంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది.
దీంతో భారీగా వచ్చే నీటితో మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే బుధవారం రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో బిల్డింగ్‌లు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అంతకంతకు వరద ప్రవాహం పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామస్థులు బస్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు.చుట్టూ ఎటు వెళ్లలేని పరిస్థితిలో అష్టజల దిగ్బంధంలో చిక్కుకున్నారు.తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. మోరంచపల్లి గ్రామంలో సుమారు వెయ్యి జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.