వాతావరణ శాఖ అలర్ట్..మరో రెండు రోజులు భారీ వర్షాలే
X
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా ప్రకటిచింది. శనివారం, ఆదివారం రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశాలోని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ప్రధానంగా దక్షిణ తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కోరింది. అదే విధంగా మూడు, నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయని అవి శనివారం నాటికి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.