తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
X
తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఉమ్మడి అదిలాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని వివరించింది.
అంతేకాకుండా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ ఉదయం నుంచే పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవ్వగా.. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.