ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు
X
కాస్త ఆలస్యమైన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల అంతటా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజుల క్రితం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించాయి. ఇవాళ్టితో తెలంగాణ మొత్తం విస్తరించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 8 జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115 - 204 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో ఏడు జిల్లాల్లో 64 - 115 మి.మీ.ల మధ్య వర్షాలు కురుస్తాయని సూచించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఆవర్తనం కొనసాగుతున్నట్లు వివరించింది.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా హైదరాబాద్ లోని ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.