బర్రెలక్క భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు
X
కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క భద్రతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసేవరకు ఒక గన్మెన్తో ఆమెకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థులకు మాత్రమే కాదు.. తమకు ముప్పు ఉందని భద్రత కోసం అభ్యర్థించే అభ్యర్థుల బాధ్యత కూడా ఈసీదేనని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 21న బర్రెలక్క సోదరుడిపై దాడి జరిగింది. దీంతో తనకు భద్రత కల్పించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించిది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు భద్రత కల్పించాలని ఆదేశించింది.
మరోవైపు బర్రెలక్క ప్రచారంలో దూసుకపోతుంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపుతూ తీసిన వీడియో ద్వారా ఫేమస్ అయిన శిరీష.. అదే సమస్యపై పోరాడేందుకు ఈ సారి ఎన్నికల బరిలో దిగింది. దీంతో అప్పటినుంచి శిరీషకు మద్దుతు పెరుగుతుంది. ప్రాణం పోయినా నిరుద్యోగుల కోసం తన పోరాటం ఆపనని బర్రెలక్క స్పష్టం చేసింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రత్యర్థులు తనను రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బయటకు చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై దాడులు చేస్తున్న వారి వివరాలు తన దగ్గర ఉన్నాయని, వాటిని ఎన్నికల తర్వాత వెల్లడిస్తానని స్ఫష్టం చేశారు.