వజ్రాల గుడ్లు పెట్టిన బుద్వేల్ భూములు.. కళ్లుచెదిరిపోయేలా..
X
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ భూములు కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోయాయి. బుద్వేల్ భూములను గురువారం హెచ్ఎండీఏ వేలం వేయగా వేల కోట్ల ఆదాయం వచ్చింది. వేలంలో అత్యధికంగా ఒక ఎకరం రూ. 41.75 కోట్లు పలికింది. మొత్తం 14 ప్లాట్లలోని వంద ఎకరాలనుగాను ప్రభుత్వానికి రూ. 3,625 కోట్ల ఆదాయం దక్కింది. ఒక్కో ఎకరం సగటున రూ. 36 కోట్లకు అమ్ముడుబోయింది. ఈ-వేలం తొలి సెషన్‌లో 58.11 ఎకరాలకుగాను రూ.2,057 కోట్లు, రెండో సెషన్‌లో 41.90 ఎకరాలకు గాను రూ. 1568 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక ఎకరం అత్యల్పంగా ఎకరం ధర రూ.33. 25 కోట్లకు అమ్ముడుబోయింది. ఇటీవల కోకాపేటలోని నియోపోలీస్ భూములను వేలం వేయగా ఓ ప్లాటులో ఎకరం ఏకంగా 100 కోట్లు అమ్ముడుబోవడం తెలిసిందే. ఆ ఊపులో బుద్వేల్ భూములను కూడా వేలం వేశారు. కోకాపేటలో కనీస ధర ఎకరాకు రూ.35 కోట్లు నిర్ణయించగా బుద్వేల్‌లో రూ.20 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ లే అవుట్ రాజేంద్రనగర్ ఎగ్జిట్ రోడ్డు పక్కనే ఉంది.
ప్రత్యేకతలు..
• బుద్వేల్‌ను ప్రభుత్వం ఐటీ హబ్‌గా మార్చనుంది. నివాస అవసరాలకు ఈ ప్రాంతం బావుటుంది.
• రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నుంచి అత్తాపూర్ ర్యాంపు దిగి సులువుగా చేరుకోవచ్చు.
• ఈ వెంచర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు వేయనున్న ఎక్స్‌ప్రెస్ మైట్రోస్టేషన్‌కు లింక్ చేస్తారు.
• ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతితో ఇక్కడ కూడా ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు.