Amit Shah Khammam Meeting : తెలంగాణకు 2.80 లక్షల కోట్లు ఇచ్చాం : అమిత్ షా
X
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్న ఆయన కమలం వికసిస్తుందని చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస - బీజేపీ భరోసా బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ను సాగనంపాలి.. బీజేపీని అధికారంలోకి తీసుకరావాలని పిలుపునిచ్చారు.
భద్రాచలం ఆలయాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని అమిత్ షా విమర్శించారు. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది కానీ ఆలయం వరకు వెళ్లదన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని ఆరోపించారు. ఇకపై కేసీఆర్ భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలో బీజేపీ సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.
ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు పార్టీ మనకు కావాలా అని షా ప్రశ్నించారు. ఎంఐఎం చీఫ్ ఓవైసీ పక్కన కూర్చుని తెలంగాణ విమోచన వీరులను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అమరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారన్నారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది 4g, 3g, 2g పార్టీలు కాదని ప్రజల పార్టీ అయిన బీజేపీ అని షా చెప్పారు. అరెస్టులతో బీజేపీ నేతలను భయపెట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని.. కానీ కాషాయ నేతలు భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని.. బీఆర్ఎస్ ఢీకొట్టేది బీజేపీ మాత్రమే అనిచెప్పారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం 2.80 లక్షల కోట్లు ఇచ్చిందన్న ఆయన.. తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.