Home > తెలంగాణ > బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది..- అమిత్ షా

బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది..- అమిత్ షా

బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది..- అమిత్ షా
X

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈసారి బీజేపీకి అవకాశమిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడారు. నవంబర్ 30న జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలేవీ నిలబెట్టుకోలేదని అమిత్ షా విమర్శించారు. గద్వాల పేదలకు 500 ఇండ్లు ఇస్తానని ఇవ్వలేదని అన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్‌.. అబద్ధపు మాటలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ టైం అయిపోయిందని.. బీజేపీ టైం వచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే టైం వచ్చిందన్న అమిత్ షా... డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసిందని అమిత్ షా విమర్శించారు. యూపీఏ సర్కారు ఉమ్మడి ఏపీకి రూ. 2 లక్షల కోట్ల నిధులిస్తే.. మోడీ సర్కారు కేవలం తెలంగాణకే రెండున్నర లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. అయినా కేసీఆర్‌ ప్రభుత్వం నిధుల్ని సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అంతా ఒక్కటేనని, అవి బీసీ వ్యతిరేక పార్టీలని విమర్శించారు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న షా.. బీజేపీకి ఓటేస్తే బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తామని, వాటిని ఎస్టీలు, ఓబీసీలకు ఇస్తామని స్పష్టం చేశారు. బీజేపీని గెలిపిస్తే.. అయోధ్యలో రామమందిర ఉచిత దర్శనం కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

Updated : 18 Nov 2023 9:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top