Home > తెలంగాణ > అసంతృప్తులకు బుజ్జగింపు.. కాంగ్రెస్ తర్వాతే బీజేపీ రెండో లిస్ట్..

అసంతృప్తులకు బుజ్జగింపు.. కాంగ్రెస్ తర్వాతే బీజేపీ రెండో లిస్ట్..

అసంతృప్తులకు బుజ్జగింపు.. కాంగ్రెస్ తర్వాతే బీజేపీ రెండో లిస్ట్..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ రెండో జాబితాపై దృష్టి సారించింది. మరో రెండు మూడు రోజుల్లో సెకండ్ లిస్ట్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. త్వరలోనే మిగతా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించినా హైకమాండ్ మాత్రం వేచిచూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతే రెండో జాబితా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటన అసంతృప్తి జ్వాలలు రగిలించింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో కొందరు.. తన అనుయాయులకు వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వలేదని మరికొందరు హైకమాండ్పై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ సీనియర్ నేతలైన బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ తదితరులు అధిష్ఠానం వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

తనతో చర్చించకుండానే హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడంపై వివేక్ వెంకటస్వామి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఇక కరీంనగర్ నుంచి బరిలో దిగనున్న బండి సంజయ్ పేరు ఫస్ట్ లిస్టులోనే ఉన్నా.. తన వాళ్లకు టికెట్ ఇవ్వకపోవడం, కరీంనగర్ వ్యవహారాల్లో ఇతర నేతలు తలదూర్చడంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇక పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి గోషా మహల్ టికెట్ ఇవ్వడంపై విక్రమ్ గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గోషా మహల్ టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్న విక్రమ్.. గత కొంతకాలంగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అయితే ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇవ్వడం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది.

పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతుండటంతో హైకమాండ్ అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి అమిత్ షా అసంతృప్తులను బుజ్జగించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న రాష్ట్రానికి రానున్న ఆయన.. వారితో విడివిడిగా సమావేశం కానున్నారు. ఒక్కో నేతతో 15 నిమిషాల పాటు మాట్లాడనున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశంపై అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.



Updated : 24 Oct 2023 2:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top