Home > తెలంగాణ > కేసీఆర్కు తీవ్ర గాయం.. ఆయన చూసి ఉండకపోతే..

కేసీఆర్కు తీవ్ర గాయం.. ఆయన చూసి ఉండకపోతే..

కేసీఆర్కు తీవ్ర గాయం.. ఆయన చూసి ఉండకపోతే..
X

మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బాత్రూంలో కాలు జారిపడటంతో ఆయనను కుటుంబసభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో సాయంత్రం కేసీఆర్కు సర్జరీ చేయనున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఇంతకీ కేసీఆర్కు గాయం ఎలా అయింది.? ఆయనను హాస్పిటల్కు ఎవరు తరలించారు..? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్కే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులంతా హైదరాబాద్లోనే ఉన్నా.. ఆయన ఫాంహౌస్లోనే ఉండిపోయారు. నిత్యం తనను కలిసేందుకు వచ్చే నేతలు, స్థానికులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి భోజనం అనంతరం నిద్రపోయిన కేసీఆర్.. అర్థరాత్రి 2గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బాత్రూంలోకి వెళ్లారు. అయితే బాత్రూం తడిగా ఉండటంతో ఒక్కసారి కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. నొప్పి భరించలేక కేసీఆర్ గట్టిగా కేకలు పెట్టారు. అయితే ఆ సమయంలో కేసీఆర్ వ్యక్తిగత సహాయకులు గానీ, గన్ మెన్లుగానీ లేకపోవడంతో చాలా సేపు ఎవరూ గమనించలేదు.

కాసేపటికి అరుపులు వినబడటంతో నిద్రలేచిన కేసీఆర్ వంట మనిషి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆయన రూంలోకి వెళ్లారు. బాత్రూంలో పడిపోయి బాధతో విలవిల్లాడుతున్న కేసీఆర్ను చూసి వెంటనే ఇతర సిబ్బందిని అలర్ట్ చేశారు. కేసీఆర్ పడిపోయిన సమాచారాన్ని హైదరాబాద్లో ఉన్న కేటీఆర్కు అందించారు. ఆయన సూచన మేరకు వెంటనే ఫాం హౌస్లో అందుబాటులో ఉన్న అంబులెన్సులో సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు తరలించారు.

మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన యశోద హాస్పిటల్ సిబ్బంది హిప్ బోన్ (తుంటి ఎముక) విరిగినట్లు నిర్థారించారు. దీంతో సర్జరీ అనివార్యమైంది. సాధారణంగా తుంటి ఎముక విరిగితే శస్త్ర చికిత్స చేసి స్టీల్ ప్లేట్ వేస్తారు. అయితే వయసురిత్యా కేసీఆర్ ఎముకల ధృడత్వం తగ్గింది. దీంతో స్టీల్ ప్లేట్లకు బిగించే నట్ల కారణంగా ఎముకలకు పగుళ్లు వచ్చే అవకాశముంది. దీంతో స్టీల్ ప్లేట్ బదులు హిప్ బోన్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన కుడి కాలి తుంటికి గాయమైంది. గతంలో ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు పడిపోవడంతో కుడి కాలి తుంటి ఎముక ఫ్రాక్చరైంది. అయితే అప్పుడు గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో చిన్న సర్జరీతో సర్దుకుంది. కానీ ఇప్పుడు గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. ఏజ్ కారణంగా ఆయన రికవరీ రేటు కూడా చాలా స్లోగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.



Updated : 8 Dec 2023 8:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top