Home > తెలంగాణ > గద్దర్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

గద్దర్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

గద్దర్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
X

నిరంకుశ పాదాల కింద నలుగుతున్న బతుకులకు జవసత్వాలను అందించేందుకు గద్దర్ గొంతు విప్లవ పాటలను ఆలపించింది. ఆ గొంతు ప్రతి గుండెను తాకింది.. ప్రతి మనిషిని తట్టిలేపింది. ఆయన పాట విని పోరాటబాట పట్టిన యువకులు ఎంతమందో. ఆయన ఒక్కో పాట.. ఒక్కో తూటాలా మారి నిరంకుశత్వంపై జంగ్ సైరన్ మోగించింది. ఇప్పుడా సైరన్ మూగబోయింది. తన పాటలతో ఎన్నో ఉద్యమాలకు ఊపిరులూదిన గద్దర్ శాశ్వత నిద్రలోకి వెళ్లారు.

గద్దర్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..

గద్దర్ అసలు పేరు విఠల్ రావు. నక్సల్ బరి బాట పట్టిన గద్దర్ కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రాసిన పాటలు జననాట్యమండలి బుక్లో వచ్చేవి. అందులో ఎన్నో పాటలు ఉన్నా.. కవుల పేర్లు మాత్రం ఉండేవి కావు. విప్లవ పాటలు రాస్తే అప్పట్లో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించేది. దీంతో పేర్లు లేకుండా పాటలు ఉండేవి.

ఈ క్రమంలో గద్దర్ తాను రాసిన పాటలకు గదర్ అని పేరు పెట్టారు. పంజాబ్లో గదర్ అంటే విప్లవం. అయితే బుక్ ప్రింట్ అయ్యేటప్పుడు అచ్చు తప్పుపడి అది గద్దర్గా మారింది. ఇక అప్పటినుంచి ఆయన గద్దర్గా మారారు. ఆ పేరు ప్రతి మారుమూల పల్లెలో ప్రతిధ్వనించింది. ఆయన పాటలు ఉవ్వెత్తున ఎగిసి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది.

శరీరంలో తూటాతో

ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యంతో ప్రజల ముందుకొచ్చారు. విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరిచారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు గ‌ద్ద‌ర్‌ మీద దాడి చేశారు. పాట‌ల తూటాల‌తో స‌మాజంలో ఎంతో చైత‌న్యం తీస్కొచ్చిన గ‌ద్ద‌ర్ శ‌రీరంలోకి బుల్లెట్లు దింపారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి బుల్లెట్లను తీసినా వెన్నులో ఉన్న ఒక్క బుల్లెట్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఒకవేళ దాన్ని తీస్తే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో 25 ఏండ్లకుపైగా శరీరంలోనే తూటాను పెట్టుకుని పోరాటాలు చేశారు.

అలసట లేకుండా పనిచేసిన...

జులై 20న అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన గద్దర్ ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ బ‌తుకు పోరాటంలో అల‌స‌ట‌లేకుండా ప‌నిచేసిన తన గుండెకు కొంత స‌మ‌స్య‌ ఏర్పడిందని, సర్జరీ తర్వాత తొంద‌ర‌గా కోలుకొని ఆరోగ్యంగా బైటికొస్తానని చెప్పారు. రెండ్రోజుల క్రితమే ఆపరేషన్ జరిగింది. వారం పది రోజుల్లో గద్దర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితారని అంతా భావిస్తున్న సమయంలో తెలంగాణ స‌మాజాన్ని, ఉద్య‌మ గీతాన్ని విడిచి.. పొడుస్తున్న పొద్దు మీద న‌డుస్తున్న విప్ల‌వ‌గీత‌మై ఇక సెల‌వంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Updated : 6 Aug 2023 5:43 PM IST
Tags:    
Next Story
Share it
Top