Medaram: మేడారంలో ముందస్తు మొక్కులు.. నెలరోజుల ముందే భక్తుల బారులు
X
అసలు జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు కుటుంబ సమేతంగా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతరకు నెలరోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు జరిగే మేడారం జాతర జరుగుతుంది. దీంతో భక్తులు ముందుగానే సెలవు దినాలు చూసుకొని అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మహాజాతర దగ్గరపడుతున్న కొద్దీ మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యాభై వేలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. దీంతో మేడారం ప్రాంగణం దేవతల గద్దెలు, జంపన్న వాగు, దుకాణాలు, మేడారం చుట్టుపక్కల వనం జనంతో కిటకిటలాడాయి. కొద్దిరోజుల్లో మహాజాతర మొదలైతే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంటుందని, చాలామంది ముందస్తుగానే మేడారం వచ్చి మొక్కులు అప్పజెప్పి పోతున్నారు. గద్దెల వద్ద రద్దీ నెలకొనడంతో దర్శనం కాస్త ఆలస్యమవుతోంది. మరోవైపు మహా జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందస్తుగా వచ్చిన భక్తులు ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రధానంగా జంపన్నవాగు వద్ద భక్తుల స్నానాలకోసం ఏర్పాట్లు త్వరగా చేయాలని భక్తులు కోరుతున్నారు.