హౌజ్ వైఫ్సే వీడి టార్గెట్ ... 6 నెలల్లో రూ. 500 కోట్ల లూటీ
X
విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, గృహిణులను లక్ష్యంగా చేసుకొని.. వారిని మోసంచేసి కోట్లు కాజేసిన రోనక్ భరత్‌కుమార్ కక్కడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దోచుకున్న సొమ్మును డిజిటల్ హవాలామార్గంలో విదేశాలకు 500 కోట్లకుపైగా తరలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ముంబయికి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్.. డిజిటల్ మార్కెటింగ్‌లో ట్రైనింగ్ తీసుకొని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు.
ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు.ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. సోషల్ మీడియా ద్వారా లింకులు పంపి దేశవ్యాప్తంగా.. కేవలం 6 నెలల్లోనే రూ.500 కోట్లకు పైగా కొట్టేసి చైనాకు తరలించాడు.
భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్‌ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు.
రెండు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా భరత్ వ్యవహారం బహిర్గతమైంది. ఈ నెల 12న నగర సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం మూడ్రోజుల పాటు కస్టడీకి తీసుకొని సేకరించిన వాంగ్మూలంలో విస్తుపోయే వాస్తవాలు వెలగులోకి వచ్చాయి.