Home > తెలంగాణ > వాక్చాతుర్యం ఉంటే చాలని.. కాల్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారా..?

వాక్చాతుర్యం ఉంటే చాలని.. కాల్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారా..?

వాక్చాతుర్యం ఉంటే చాలని.. కాల్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారా..?
X

మంచి చదువులు చదివి.. హైదరాబాద్ నగరానికి ఉద్యోగాన్వేషణకై వచ్చిన నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు కొందరు కాల్‌సెంటర్ల నిర్వాహకులు. ఎలాంటి ఉన్నత విద్యార్హతలు లేకపోయినా ఫర్వాలేదు, కమ్యూనికేషన్ ఉంటేచాలు.. కార్పొరేట్‌ తరహా ఉద్యోగంతో.. హాయిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయొచ్చని వారిని మభ్యపెడుతున్నారు. ఈ మాటలు విని యువత అలాంటి ఉద్యోగాల్లో చేరి, పోలీసు కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్తును పాడుచేసుకుంటోంది. సైబర్‌ నేరగాళ్లు ఏర్పాటుచేస్తున్న ఇలాంటి కాల్‌సెంటర్లు నిరుద్యోగుల పాలిట శాపంలా మారుతున్నాయి. ఇలాంటిచోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారి విషయంలో గతంలో చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఫలితంగా అమాయకులు జైలు పాలవుతున్నారు.

ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకులు, ఈకామర్స్‌ సంస్థల నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించి.. సామాన్య ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. కోట్ల మంది డేటాను దొంగిలించి డార్క్‌వెబ్‌లో అమ్మిన ఘరానా మోసగాడిని ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా సమాచారాన్ని కొనుగోలు చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు దానిద్వారా మోసాలకు పాల్పడేందుకు ఏకంగా కాల్‌సెంటర్లే పెడుతున్నారు. వీటిలో పనిచేసేందుకు ఆకర్షణీయమైన జీతాలను ఇస్తూ నిరుద్యోగులను నియమించుకుంటున్నారు. వీరిద్వారా మాయమాటలు చెప్పించి మోసాలకు తెగబడుతున్నారు.

గత శుక్రవారం సైబరాబాద్‌ పోలీసులు అమెరికా దేశస్థులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో కాల్‌సెంటర్‌ నిర్వాహకులతోపాటు అక్కడ పనిచేస్తున్న 115 మందిపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి నేరాలు బయటపడిన పలు సందర్భాల్లో.. కాల్‌సెంటర్ల యజమానులపై మాత్రమే కేసు నమోదు చేసి.. ఉద్యోగులను మాత్రం మానవతా దృక్పథంతో వదిలేసేవారు. ఇప్పుడు వారిపైనా కేసులు నమోదవుతున్నాయి. తాము మోసం చేస్తున్న విషయం ఉద్యోగులకూ తెలుసని, తెలిసికూడా తప్పు చేయడం నేరమే కాబట్టి అటువంటివారిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాల్‌సెంటర్‌ ఉద్యోగమనగానే వెనకాముందూ ఆలోచించాలని, ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత వేరే ఉద్యోగంలో చేరడం కూడా కష్టమే అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలని నిరుద్యోగులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.



Updated : 14 Aug 2023 4:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top