నన్ను చూసి నవ్వాడని కిడ్నాప్ చేశా... ‘నీలోఫర్’ మమత..
X
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడి ఉదంతాన్ని పోలీసులు సుఖాంతం చేశారు. వందకుపైగా కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను పెంచుకుందామని ఎత్తుకెళ్లిన దంపతులు బాన్సువాడలో దొరికారు. చిన్నారిని హైదరాబాద్ తీసుకొచ్చి తల్లిచెంతకు చేర్చారు. నిందితురాలు రెండు రోజులపాటు పిల్లాడికి తనే పాలు పట్టింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కాట్రోత్ మమత, శ్రీను దంపతులు. మమత నీలోఫర్ ఆస్పత్రిలో ఇటీవల కాన్పు అయింది. అయితే పుట్టిన బిడ్డ చనిపోతాడని భయపడ్డారు. గతంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు చనిపోవడంతో మూడో బిడ్డ కూడా దూరమవుతారని ఆందోళనపడ్డారు. పిల్లాడికి చికిత్స చేయిస్తూ ఆస్పత్రిలోనే ఉన్నారు. కొడుకు చనిపోతే మరొకర్ని పెంచుకోవాలని ఆస్పత్రిలోని పిల్లలపై కన్నేశారు. మరోపక్క.. గండిపేటకు చెందిన ఫరీదా బేగం అనే మహిళ తన పెద్దకొడుకును చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించింది. రెండో కొడుకు ఫైజల్‌ను కూడా తనతో తీసుకొచ్చింది. ఈ నెల 14వ తేదీన ఫరీదా భోజనం కోసం బయటికి వెళ్లడంతో మమత, శ్రీను మరో ఇద్దరి సాయంతో ఫైజల్‌ను ఎత్తుకెళ్లారు. అతని తల్లి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రి దగ్గర నుంచి జేబీఎస్ బస్టాండు మధ్య ఉన్న వందకుపైగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫైజల్‌ను తీసుకెళ్లిన జంట బాన్సువాడకు వెళ్లినట్లు తేలింది. అక్కడి పోలీసులు వివరాలు సేకరించి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. బాబును పెంచుకోవడానికే ఎత్తుకెళ్లామని నిందితులు చెప్పారు. ‘‘ఆ పిల్లాడు నన్ను చూసి నవ్వాడు. అందుకు తీసుకొచ్చేశాం’’ అని మమత చెప్పింది.