హైదరాబాద్‌లో భారీ స్కామ్.. రూ. 530 కోట్లు మాయం?
X
అత్యాశకు పోయి తమ కష్టార్జితాన్ని కేటుగాళ్లకు సమర్పించుకుంటున్నారు మధ్య తరగతి జనాలు. పిల్లల భవిష్యత్తు కోసమో, లేదంటే శుభకార్యాలకు అవసరమొస్తుందనో భావించి.. ప్రతీ నెలా కష్టపడి సంపాదించిన సొమ్మును అన్యాక్రాంతం చేస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 200 మంది ప్రజలు.. ఇద్దరు వ్యక్తుల చేతిలో దారుణంగా మోసపోయారు. వారి మాటలు నమ్మి అక్షరాలా రూ. 530 కోట్లు పొగొట్టుకున్న ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న సీసీఎస్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్... ఇదొక భారీ స్కామ్ గా తెలిపారు.
విజయవాడకు చెందిన గుడే రాంబాబు, భీమవరానికి చెందిన పెనమెట్స కృష్ణంరాజు వ్యాపార భాగస్వాములు. లాభాలు రావడంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు నిర్ణయించారు. ఇందుకు తెలిసిన వారి నుంచి ఆర్థిక సాయం తీసుకున్నారు. మొదట్లో మూవింగ్ కన్జుమర్ గూడ్స్‌ను విక్రయిస్తూ, ఆ వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు. ఇందుకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు సేకరించారు. పెట్టుబడి పెట్టిన వారికి తొలుత కొన్ని నెలలు 6 శాతం లాభాల చెల్లించారు. వారికలా ఆశచూపి ... ఆ నోటా ఈ నోటా పాకేలా చేశారు. అతి తక్కువ సమయంలోనే దాదాపు 200 మందికి కూడా.. తమ వద్ద పెట్టుబడి పెడితే 6 నుంచి 13 శాతం వరకు ప్రతినెలా లాభాలిస్తామంటూ నమ్మించారు. వ్యాపారాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ వరకూ విస్తరించి.. గొలుసు కట్టు విధానంలోకి మార్చేశారు.
పెట్టుబడి పెట్టిన వారికి ఇటీవల లాభాలు చెల్లించడంలో ఆలస్యం చేశారు. దీంతో బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో మాదాపూర్‌లో ఉన్న ఇంటికి తాళం వేసి.. నిందితులిద్దరూ పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోసం చేసిన ఆ ఇద్దరిని బుధవారం గచ్చిబౌలిలో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ ఏపీ, తెలంగాణలో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలిందని బుధవారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర జాయింట్ సీపీ గజారావు భూపాల్, సీసీఎస్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.