తప్పులో కాలేసిన సీవీ ఆనంద్.. ముంబై బిచ్చగాడిపై ట్వీట్ డిలీట్
X
బిక్షాటనను వృత్తిగా మార్చుకుని కోట్లు సంపాదిస్తున్నాడు ముంబైకి చెందిన భరత్ జైన్. నెలకు రూ.7 కోట్లు సంపాదించే ఈయన ఇటీవలే రూ.22 కోట్ల విలువైన బంగ్లా కొన్నాడు. అయితే రోడ్లపై అడుక్కునే భరత్ జైన్ సాదాసీదా మనిషి కాదని, ఐఐటీ మద్రాస్ నుంచి బీఈ పూర్తిచేశాడని, ర్యాంక్ హోల్డర్ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దాదాపు 18వల మంది బిచ్చగాళ్లతో భరత్ జైన్ ఓ ముష్టి సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడని అందులో రాశారు. 18వేల మంది బిచ్చగాళ్లందరూ తమ రోజువారీ ఆర్జనలో 20శాతం ఆయనకు ఇస్తారంటూ సీవీ ఆనంద్ ట్వీట్ లో రాసుకొచ్చారు.
సీవీ ఆనంద్ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు భరత్ జైన్ విషయంలో ఆయన తప్పులో కాలేశారంటూ కామెంట్లు పెట్టారు. భరత్ జైన్ ముంబైలోని అత్యంత సంపన్నుడైన బిచ్చగాడన్న మాట వాస్తవమే అయినా ఆయన ఎడ్యుకేషన్ గురించి, బెగ్గింగ్ మాఫియా గురించి రాసిన వార్తల్లో నిజం లేదని పలువురు నెటిజన్లు ఫ్యాక్ట్ చెక్ లింక్స్ కూడా జత చేశారు. దీంతో సీవీ ఆనంద్ సైతం ఆ ట్వీట్ డిలీట్ చేశారు.
ఫ్యాక్ట్ చెక్ లింక్స్ను పరిశీలిస్తే భరత్ జైన్ కు రూ.7.5కోట్ల సంపద ఉన్న మాట వాస్తవమేనని, అతనికి ముంబైలో రూ.1.2 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఫ్లాట్ కూడా ఉన్నట్లు తేలింది. అయితే ఆయన ఐఐఎం కలకత్తా నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశారని, ముంబైలో ఓ బెగ్గింగ్ ముఠాను నడుపుతున్నారని, ముష్టి సామ్రాజ్యాన్ని విదేశాలకు సైతం విస్తరించే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఇదంతా భరత్ జైన్ గురించి వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించిన స్టోరీ అని తెలిసింది.
నిజానికి నిరుపేద కుటుంబంలో పుట్టిన భరత్ జైన్ ప్రాథమిక విద్యను కూడా అభ్యసించలేదు. సరైన ఉపాధి దొరకకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఆయన బిక్షాటనను వృత్తిగా మార్చుకున్నాడు. నిత్యం ఛత్రపతి శివాజీ టర్మిలన్, ఆజాద్ మైదాన్ ప్రాంతంలో 10 నుంచి 12 గంటలు బిక్షాటన చేసి రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు సంపాదించే భరత్.. నెలకు రూ.60 నుంచి 70 వేలు ఆర్జిస్తాడు. ఆయనకు భార్యా ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకులిద్దరూ ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జీవితంలో ఆర్థికంగా స్థిరపడినా భరత్ జైన్ మాత్రం ఇప్పటికీ బిక్షాటనను వదలకపోవడం విశేషం.