Intensity of Cold : ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణం బాగా చల్లబడి.. జనం చలికి వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చలి మరింత అధికంగా ఉంటోంది. ఉదయం వేళల్లో దట్టమైన మంచు కురుస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు తొలగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరుగుతోందని తాజాగా, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ చలి తీవ్రత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
ప్రస్తుతం రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో అదే పరిస్థితి కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని శ్రావణి అన్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉన్నాయన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు.. అత్యల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
రెండు రోజులుగా కింది స్థాయి నుంచి తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారిణి తెలిపారు. వృద్ధులు, పిల్లలు ఈ రెండు మూడు రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. అయితే, డిసెంబర్ ఆఖరి వారం నుంచి చలి తీవ్రత మరింత పెరగడంతోపాటు శీతల గాలులు వీస్తాయని చెప్పారు.