9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... మూడు రోజులపాటు భారీ వర్షాలు
X
రాగల మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నట్టు చెప్పింది. ఇవాళ, రేపు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని స్పష్టం చేసింది.
జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగాం, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక బుధవారం కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.