Hyderabad Police Alert: పండక్కి ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీకే నష్టం!!
X
దసరా, బతుకమ్మ పండుగల వేళ హైదరాబాద్ ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో పలు కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు ఖాళీ అవుతున్నాయి. ఎలక్షన్ టైమ్ కాబట్టి పోలీసులంతా ఎన్నికల విధుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే పండక్కి ఊరెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచే ఉపాయం చేయండి.
సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇళ్లల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచకండి. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో గానీ, లాకర్లు లేని వారు తమ బంధువుల ఇళ్ళలో భద్రపరుచుకోవాలి. అదే విధంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ ఊరికి ప్రయాణం కట్టిన పరిస్థితుల్లో తెలిసిన వారిని మీ ఇళ్లల్లో రాత్రివేళ పడుకోమని చెప్పండి. ఇంట్లో మనుషుల ఉన్నారని దొంగలు.. చోరీకి భయపడతారు.
తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ వుంటే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. లేదా 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయటంతో పాటు వీలైతే చక్రాలకు కూడా చైన్స్‌తో కూడిన తాళం వేయటం మర్చిపోవద్దు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
ఇంటి ముందు న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు జమవ్వకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వాటిని గమనించి దొంగలు దొంగతనాలకు వస్తారు. మెయిన్ డోర్ కి తాళం వేసినా కనిపించకుండా కర్టెన్స్ అడ్డుగా ఉంచాలి. ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి.. తరచూ గమనించాలని ఇరుగుపొరుగు వారికి చెప్పాలి. కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
ఊరు వెళ్లేటప్పుడు.. మీ వెంట బ్యాగుల్లో బంగారు ఆభరణాలు పెట్టి ప్రయాణం చేయకండి. ఇలాంటి రద్దీ సమయాల్లో రైళ్లు, బస్సుల్లోనూ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.