అగ్రరాజ్యంలో మరో దారుణం.. హైదరాబాద్ విద్యార్థిపై దాడి..
X
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్తున్న భారత విద్యార్థులకు రక్షణలేకుండా పోతోంది. ఇటీవలే ఆగంతకుల దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటనలు మరువకముందే మరో ఇన్సిడెంట్ ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మజాహిర్ అలీ చికాగోలోని ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఫుడ్ కోసం బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తున్న అలీని నలుగురు దుండగులు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అతన్ని పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అలీ తల, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. అతని వద్ద సెల్ ఫోన్ లాక్కొని పోయారు.
దుండగుల దాడిలో తీవ్ర గాయాలైన సయ్యద్ మజాహిర్ ఆలీ తనని కాపాడాలంటూ ఇండియన్ ఎంబసీ అధికారులకి ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు దాడి ఘటనను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ కుమారుడిని కాపాడాలని లేఖ రాశారు.
అమెరికాలో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చాలు దుండగులు దాడులకు పాల్పడి అందిన కాడికి దోచుకుపోతున్నారు. గతవారం హైదరాబాద్ కు చెందిన శ్రేయస్ రెడ్డి అనే విద్యార్థులు కొందరు దుర్మార్గులు పొట్టనబెట్టుకున్నారు. ఓహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుతున్న అతనిపై కొందరు దాడి చేయడంతో చనిపోయారు. అంతకు ముందు నీల్ ఆచార్య, హర్యానాకు చెందిన వివేక్ సైనీపై దాడి చేసిన దుండగులు వారి ప్రాణాలు తీశారు. తాజాగా మజాహిర్ అలీ ఉదంతం వెలుగులోకి రావడంతో ఉన్నత చదువుల కోసం తమ పిల్లల్ని అమెరికాకు పంపిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.