Telangana: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు
X
"రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది." (Yellow Alert to Telangana) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. (Heavy Rains in Telangana) అక్టోబర్ 2వ తేదీ వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. నిర్మల్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లా తడ్వాల్‌లో 11.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. సాయంత్రం అయ్యే సరికి జోరు వానపడుతుండటంతో ఊరట చెందుతున్నారు.