నేను బాగానే ఉన్నా.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్
X
ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకులోనైన ఎమ్మెల్సీ కవిత తిరిగి క్యాంపెయినింగ్ ప్రారంభించారు. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఇటిక్యాలలో రోడ్ షో సందర్భంగా ఆమె కండ్లు తిరిగి పడిపోయారు. దీంతో ప్రచార వాహనాన్ని దిగి స్థానిక కార్యకర్త ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఓ చిన్నారితో కాసేపు ముచ్చటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆ పాపతో మాట్లాడిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చిందని ట్వీట్ చేశారు. విశ్రాంతి అనంతరం కవిత మళ్లీ ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
"నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చిన్నారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను" అని ట్వీట్ చేసిన కవిత.. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. డిహైడ్రేషన్ కారణంగానే కవిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటిక్యాలలో నిర్వహించిన రోడ్డు షోలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కు మద్దతుగా కవిత ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత మాట్లాడుతున్న సమయంలో కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రచార రథం నుంచి కిందకు దిగారు.